2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో భాగంగా ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ తిరుమలపూడి రవికుమార్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని కళాశాలల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఫిబ్రవరి 2 నుండి 21 వరకు విడతల వారీగా పరీక్షలు నిర్వహిస్తారు. ఆర్టీసీ, విద్యుత్ అధికారులకు విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేలా, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.