జుక్కల్ సెగ్మెంట్ లోని తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని మద్నూర్ మండలం చిన్న ఎక్లారా, శేఖాపూర్ గ్రామ సరిహద్దులోని పంట పొలాల్లో బుధవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వందలాది ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న, వరి, జొన్న పంట అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. భారీగా ఆస్తి నష్టం సంభవించడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. తీవ్రమైన ఎండల వల్ల ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా బీడీ తాగి పడేయడం వల్ల జరిగిందా అన్నది పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారుల దర్యాప్తులో తేలే అవకాశం ఉంది.