ఇంటికి గొళ్లం పెట్టి బయటకు వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్లైన సంఘటన హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హబీబ్నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సమీ బెడ్షీట్ వ్యాపారం చేస్తుంటాడు. బుధవారం మధ్యాహ్నం పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడానికి ఇంటికి గొళ్లం పెట్టి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని సుమారు మూడున్నర తులాల బంగారు నగలతో పాటు రూ.30 వేల నగదును దోచుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.