మేడే స్ఫూర్తితో కార్మిక హక్కులను రక్షించుకోవడానికి పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి యాదయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిభట్ల సర్కిల్‌లో జరిగిన మేడే వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని, నాలుగు లేబర్ కోడ్ల ద్వారా కార్మిక దోపిడీకి తెరలేపిందని విమర్శించారు. 8 గంటల పని దినాన్ని పక్కనపెట్టి 12 గంటల పని విధానాన్ని రుద్దడం వల్ల కార్మికుల ఆరోగ్యం, భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత కరువైందని ధ్వజమెత్తారు. కార్మికుల ఐక్యత చాటాల్సిన అవసరం ఉందని నాయకులు శివకుమార్ గౌడ్, కాటంరాజు గౌడ్, అనురాధ, పర్వతాలు పేర్కొన్నారు.