కార్తీక మాసం పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శివాలయాలు బుధవారం భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండే మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి, శివనామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నారు. కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో దీపం వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, 365 వత్తులతో కూడిన కార్తీక దీపాలను సమర్పించి, తమ ఇంట సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆలయ కమిటీలు క్యూలైన్ల ఏర్పాటుతో సహా ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.