సంగారెడ్డి జిల్లాలో అర్థరాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రోహిణీ కార్తీ ప్రారంభంలోనే ఈ స్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి. వాతావరణ శాఖ గంటకు 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. వట్పల్లిలో 7.5 సెం.మీ, న్యాల్కల్ లో 7.35 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. ఝరాసంగం మండలం ప్యారవరం గ్రామంలో బీహార్ కు చెందిన తులసి రామ్ వాగులో చిక్కుకోగా, గ్రామస్తులు అతడిని కాపాడారు. కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం వద్ద వాలాద్రి పొంగింది. పలు గ్రామాల వాగులు, చెరువులు నిండుకుపోయాయి. మామిడి, నీళ్ల జొన్న, కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొలాలకు వెళ్లేవారు, మేకల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.