భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఖాయ్ జింగ్ కాంగ్–ఆరోన్ తాయ్ (మలేసియా) ద్వయాన్ని 19–21, 21–17, 21–13తో ఓడించి, ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. 65 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో భారత జంట తొలి గేమ్ కోల్పోయినా, ఆ తర్వాత పుంజుకొని వరుసగా గేమ్‌లు గెలుచుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ జోడీ కిమ్ వన్ హో–సియో సెంగ్ జే (దక్షిణ కొరియా)తో తలపడనుంది.