తెలంగాణ రైతులు దేశంలోనే అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేస్తున్నా, కేంద్రంలోని
బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర రైతుల పట్ల వివక్ష చూపుతూ ధాన్యం సేకరణ లక్ష్యాలను కుదించడం దురదృష్టకరమని హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలనే సంకల్పంతో ప్రజాపాలన ప్రభుత్వం పనిచేస్తుంటే, కేంద్రం మాత్రం రైతులను నిరాశపరుస్తోందని ఆయన తెలిపారు. 2025-26 రబీ (యాసంగి) సీజన్‌లో ఇప్పటివరకు 67.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ.12,375 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని, దీనివల్ల 10 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందారని మంత్రి పేర్కొన్నారు.