రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఆదివారం వేకువజామున కురిసిన భారీ వర్షం అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. మండల కేంద్రంతో పాటు రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. తేమ శాతం 17 ఉన్నా నిర్వాహకులు తూకం వేయలేదని, ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తూకాలను వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు.