రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు తప్పకుండా ఇవ్వాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలో జరిగిన సమీక్ష సమావేశంలో, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలను డీసీఓలను అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్లో మెనూ వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని, ఆహార పదార్థాల రిజిస్టర్లు పక్కాగా నిర్వహించాలని, కాంట్రాక్టర్ సరఫరా చేసే కోడిగుడ్లు, చికెన్, మటన్ నాణ్యతను పరిశీలించాలని, లోపం ఉంటే తిప్పి పంపాలని సూచించారు. ఆహార సిబ్బంది మాస్కులు ధరించాలని, కిచెన్, డైనింగ్ హాల్ పరిశుభ్రంగా ఉంచాలని, శుద్ధమైన నీటిని అందించాలని, విద్యాలయాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.