కోదాడలో ఇటీవల సీతారాంపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఫోటోగ్రాఫర్ ఇమ్రాన్ కుటుంబానికి కోదాడ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులు అండగా నిలిచారు. తోటి సభ్యుని కుటుంబానికి సహాయం అందించాలనే ఉద్దేశంతో, యూనియన్ సభ్యులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి రూ. 60,500 సమీకరించారు. బుధవారం యూనియన్ ప్రతినిధులు ఇమ్రాన్ నివాసానికి వెళ్లి, సేకరించిన నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా విరాళాలు అందించిన ప్రతి ఫోటో, వీడియోగ్రాఫర్‌కు యూనియన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు వనపర్తి వర్మతో పాటు మరికొంతమంది సభ్యులు పాల్గొన్నారు.