అనంతగిరి మండలం త్రిపురారం గ్రామానికి చెందిన ఒక జంతు ప్రేమికుడి పెంపుడు కుక్కకు అరుదైన డెంటల్ సర్జరీ జరిగింది. రెండు రోజుల క్రితం మూతికి జిగట పదార్థం అంటుకోవడంతో దాన్ని వదిలించుకునేందుకు తల విదిలించగా పక్కనే ఉన్న రాయికి మూతి బలంగా తగిలింది. దీంతో ఒక పన్ను పాదుతో సహా విరిగి పక్కకు చీలిపోయింది. నొప్పితో రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో యజమాని కుక్కను ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకువచ్చారు. విరిగిన దంతాన్ని పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ మత్తు ఇచ్చి పాదును సరిచేసి, దంతాన్ని కుట్లతో అతికించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. మూడు రోజుల పాటు ద్రవాహారం, మందులు ఇవ్వాలని సూచించారు.