నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కోదాడ పట్టణంలో రెండు రోజుల పాటు వర్చువల్ పద్ధతిలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు గురువారం ముగిసింది. మహానాడు ఇన్ఛార్జ్‌లు ముత్తినేని సైదేశ్వరరావు, ఓరుగంటి ప్రభాకర్ పర్యవేక్షణలో జరిగిన ఈ సభలు విజయవంతమయ్యాయి. ముగింపు సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి నాయకులు, ఇన్ఛార్జ్‌లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అధినేత చంద్రబాబు నాయుడు వర్చువల్ సందేశం పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్తేజాన్ని నింపిందని నాయకులు తెలిపారు. రాబోయే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఐక్యంగా పనిచేస్తామని, ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తప్పక వస్తుందని వారు పేర్కొన్నారు.