సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని సంగెం గ్రామంలోని పురాతన శివాలయంలో గుప్త నిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపిన ఘటన కలకలం సృష్టించింది. రెండు రోజుల క్రితం రాత్రి జరిగిన ఈ ఘటన ఆదివారం గ్రామస్తుల చొరవతో వెలుగులోకి వచ్చింది. శివాలయం వెనుక భాగంలో జరిగిన తవ్వకాల్లో కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ వంటి ఆనవాళ్లు లభించాయి. రైతు జటంగి వెంకన్న తన చెత్తను వెతుకుతూ శివాలయం వద్దకు వచ్చి, మట్టిని తీసినట్లు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. విషయం పోలీసులకు తెలియడంతో ఎస్సై క్రాంతి కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.