1947 ఆగస్టు 15న భారత్ స్వాతంత్ర్యం పొందిన తొలి ఉదయం ఢిల్లీ అపూర్వ దృశ్యాలకు సాక్ష్యమైంది. దేశం నలుమూలల నుంచి ప్రజలు స్వాతంత్ర్య వేడుకలను చూసేందుకు ఢిల్లీకి తరలివచ్చారు. ఆగస్టు 14 అర్ధరాత్రి శాసనసభ పరిసరాలు లక్షలాది మందితో కిక్కిరిశాయి. గడియారం 12 కొట్టగానే భారత్ స్వతంత్ర దేశంగా అవతరించడంతో ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. మరుసటి ఉదయం ఎర్రకోటపై జవహర్‌లాల్ నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడాన్ని చూసేందుకు దాదాపు 10 లక్షల మంది తరలివచ్చినట్లు చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయి. ‘జనగణమన’, ‘వందేమాతరం’ గీతాలు మార్మోగగా.. యూనియన్ జాక్ స్థానంలో ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకమే కనిపించింది. అయితే స్వాతంత్ర్య ఆనందంతో పాటు దేశ విభజన విషాదం కూడా ఆ రోజును వెంటాడింది. అయినా ఆ తొలి ఉదయం కోట్లాది భారతీయులకు కొత్త ఆశలు, స్వేచ్ఛ, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిపోయింది.