హైదరాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కలకలం రేపుతోంది. ఆయుధాలు భద్రపరిచే గది తాళం పగులగొట్టి 4 ఏకే-47లు, 7 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్‌తో పాటు మందుగుండు సామగ్రిని దుండగులు ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన ఆయుధాలకు సరిపోయే తూటాలనే దొంగలు తీసుకెళ్లడంతో, ఇది పక్కా ప్రణాళికతో జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆయుధాల గురించి బాగా తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని నిర్ధారణకు వస్తున్నారు. మద్రాస్ రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ప్రశ్నించినా, సీసీ కెమెరాలను పరిశీలించినా పోలీసులకు ఎలాంటి పురోగతి లభించలేదు.