శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఎంతో విశిష్టత కలిగినది. హిరణ్యకశిపుడిని వధించిన తర్వాత ఆగ్రహంతో ఉన్న స్వామిని ప్రహ్లాదుడు ఈ ప్రదేశంలో శాంతపరచగా, అందుకు నిదర్శనంగా స్వామి ప్రహ్లాదునితో కలిసి దర్శనమిస్తారు. 10వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో, మూలవిరాట్టుకు అభిషేకం చేసిన తర్వాత నాభి నుంచి వచ్చే స్వేదాన్ని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. ఈ స్వేదం ఎలా వస్తుందనేది నేటికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలింది. భారతదేశంలో ప్రహ్లాదునితో సహా శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇదే.