ములుగు జిల్లా తాడ్వాయి–పసర గ్రామాల మధ్య శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో బొలెరోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మల్లంపల్లి మండలం సోమ తండాకు చెందిన వారు భద్రాచలం దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.