మేడారంలో నేడు భక్త కోటి నీరాజనాలు అందుకునేందుకు ఇలవేల్పయిన సమ్మక్క తల్లి తన గద్దెపై అట్టహాసంగా కొలువుదీరనున్నది. మేడారంలోని అడవిలో 4 రోజుల పాటు జరిగే ఈ మహాజాతరతో అభయారణ్యం జనారణ్యమవుతుంది. ఆదివాసి ఆరాధ్య దేవత నెలవైన చిలుకలగుట్ట నుంచి గద్దెకు సమ్మక్క తరలివెళ్లే శుభ ఘడియను తిలకించేందుకు భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ మహా క్రతువు కోసం మంత్రి సీతక్క యంత్రాంగంతో సాయంత్రం వేళ గుట్ట పరిసరాలకు చేరుతారు.