ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నేలకొండపల్లి మండలం బుర్హాన్‌పురం ప్రాంతంలో భార్య రమ్య, తన భర్త కొణతల రాము(29), ఐదేళ్ల కూతురు దివ్యనైనీలను హత్య చేసి, మూడు రోజులుగా మృతదేహాలతోనే ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చిన్న కూతురు దీక్షను కూడా హత్య చేసేందుకు ప్రయత్నించి, విషయం బయటపడుతుందనే భయంతో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం రమ్య సోదరుడు సమాచారం ఇవ్వడంతో పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా, మంచం కింద రాము, దివ్యనైనీ మృతదేహాలు, పక్కనే అపస్మారక స్థితిలో ఉన్న రమ్య, దీక్ష కనిపించారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. రమ్య కారణాలు చెప్పడానికి నిరాకరించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.