భువనగిరి ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ లో కాలం చెల్లిన పాత ఏజెన్సీల టెండర్లను రద్దు చేసి, సానిటేషన్, సెక్యూరిటీ గార్డు కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు అందేలా నూతన టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు జిల్లా హాస్పిటల్ లో ధర్నా నిర్వహించి, సూపరింటెండెంట్ కు వినతి పత్రం సమర్పించారు. గతంలో ఎంపికైన ఏజెన్సీల కాలపరిమితి ముగిసినా కొత్త టెండర్లు ప్రారంభించలేదని, పాత టెండర్ ముసాయిదాలో కార్మికులకు నష్టదాయకమైన అంశాలున్నాయని ఇమ్రాన్ ఆరోపించారు. కొత్త టెండర్ పాలసీలో కనీస వేతనం రూ. 26,000, పండగ, జాతీయ సెలవులు ఉండేలా చూడాలని ఆయన కోరారు.