యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామ శివారులో పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై దాడి నిర్వహించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఎల్లమ్మ గుడి సమీపంలో తనిఖీలు చేపట్టగా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సుమారు 200 గ్రాముల గంజాయి, ఒక ఫ్యాషన్ మోటార్ సైకిల్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కలకత్తా నుంచి గంజాయి కొనుగోలు చేసి మాదాపూర్ ప్రాంతానికి తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి వినియోగం, అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తుర్కపల్లి ఎస్ఐ హెచ్చరించారు.